తలస్నానం ఏరోజు చేయాలి?


తలస్నానం ఏరోజు చేయాలి?
(Good day for Headbath)

ఈకాలంలో ఎప్పుడంటే అప్పుడు తలస్నానం చేస్తున్నాం. చాలామంది ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారు. అయితే మన పూర్వీకులు ప్రతి పనికీ కొన్ని నియమాలు, నిర్దేశాలు చేసినట్లే అభ్యంగన స్నానానికి కూడా ఒక సూత్రీకరణ చేశారు. హిందువులు ఎప్పుడు తలస్నానం చేయాలో, చేస్తే మంచిదో ధార్మిక గ్రంధాలలో నిర్దేశించడం వల్ల అది ఒక ఆచారంగా కొనసాగుతోంది.

హిందూ ధర్మశాస్త్రాలను అనుసరించి, స్త్రీలు శుక్రవారంనాడు తలస్నానం చేయడం శ్రేష్టం. పురుషులు శనివారంనాడు తలంటి పోసుకోవడం ఉత్తమం. ఈ మాట అనేక ధర్మగ్రంధాల్లో, అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. ఇటువంటి ఋషిప్రోక్తం అయిన అంశాలను హిందువులు తరతరాలుగా సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఆడవాళ్ళు శుక్రవారంనాడు అభ్యంగనస్నానం ఆచరించడం అలవాటుగా మారింది.

స్త్రీలు శుక్రవారంనాడు, పురుషులు శనివారంనాడు అభ్యంగనస్నానం ఆచరించడం వెనుక ఏమైనా శాస్త్రీయత ఉన్నదా, ప్రత్యేక లాభాలు ఏమైనా ఒనగూరుతాయా అనే సంగతి ఇప్పుడు చూద్దాం.

అభ్యంగనస్నానం చేసేముందు శరీరమంతా నువ్వులనూనె రాసుకుని మర్దన చేసుకోవడం ఆచారంగా వస్తోంది. అలా నూనె రాసుకుని కొంతసేపు ఎండలో కూర్చుని, ఆ తర్వాతే తలంటు చేసే అలవాటు ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఇలా చేయడంవల్ల సూర్యకాంతిలో ఉండే నీలవర్ణం (Blue Colour) శుక్రగ్రహానికి అనుకూలమైన రంగు కనుక, అది గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే పురుషులు శనివారంనాడు చేయడంవలన ఊదారంగుతో కూడిన నీలం రంగు (Indigo Colour) సత్ఫలితాలను ఇస్తుంది.

స్త్రీపురుషుల శరీర నిర్మాణక్రమంలో సహజంగానే కొన్ని తేడాలు ఉన్నాయి. వాటిప్రకారం స్త్రీలకు మామూలు నీలిరంగు, పురుషులకు ఊదారంగుతో కూడిన నీలం మేలు చేస్తాయి. కలర్ థెరపీ ప్రకారం చూస్తే ఇందులో సత్యం కనిపిస్తుంది.

అభ్యంగనస్నానం మాదిరిగానే గృహప్రవేశం, పెళ్ళి, వ్యాపారం, ఉపనయనం మొదలైనవాటిక్కూడా ఒక్కోదానికీ ఒక్కో వారాన్ని నిర్దేశించారు. ఆ రోజుల్లోనే ఎందుకు చేయాలి.. ఇతర రోజుల్లో చేస్తే ఏమౌతుంది అని వితండవాదానికి పొతే అందుకు తగ్గట్లే దుష్పరిణామాలు ఎదురౌతాయి.


**************************************************