ప్రకృతి విపతులు జంతువులకు ముందే తెలుసా?




ప్రకృతి విపతులు జంతువులకు ముందే  తెలుసా?
Animals Sixth Sense


సిక్స్త్ సెన్స్ అంటే జరగబోయే విషయాలు ముందే తెలిసిపోవడం. ఒకరకంగా ఇది జోస్యం లాంటిదన్నమాట. అనేక సందర్భాల్లో సిక్స్త్ సెన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎక్కువమందికి కాకపోయినా కొద్దిమందికి ఈ సిక్స్త్ సెన్స్ అనే అనుభూతికి వస్తుంది.
జరిగిన సంఘటనలను బట్టి జరగబోయే పరిణామాలను ఊహించడం సిక్స్త్ సెన్స్ కాదు. ఒక అద్భుతమైన, అపురూపమైన శక్తి కారణంగా భవిష్యత్తులో జరగబోతున్న అంశం ముందుగానే తెలిసిపోవడం. ఈ సిక్స్త్ సెన్స్ మనుషుల్లోనే కాదు, జంతువుల్లోనూ ఉందని తెలిపే ఉదంతాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సిక్స్త్ సెన్స్ మనకంటే జంతువులకే ఎక్కువట. రాబోయే విపత్తులు, వాతావరణంలో తలెత్తనున్న మార్పులు ముందుగానే తెలిసిపోతాయట. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
కుక్కలకు యమ భటులు కనిపిస్తారట. మనిషి ప్రాణం పోయేముందు కుక్కలు రోదిస్తాయి. అందుకే ఎక్కడయినా కుక్క మామూలుగా అరవకుండా మూలుగుతున్నట్లుగా లేదా ఏడుస్తున్నట్లుగా కనుక అరిస్తే అది చేదు శకునం అని అర్ధమైపోతుంది. కొందరు కుక్కను ఏడవకుండా చేస్తే జరగాల్సిన అనర్ధం జరగదని ఆశపడి దాన్ని మందలిస్తారు. నిజానికి ఒక ప్రాణం పోతోందని సూచించడానికే శునకం మూలుగుతుంది. ఇకపై మీరే గమనించండి.. కుక్క గనుక రోదించింది అంటే ఆ సందులో ఎవరో ఒకరి ప్రాణాలు కొన్ని గంటల్లో పోవడం ఖాయం.
వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నప్పుడు కోళ్ళు, కుక్కలు, పిల్లులు, పాడి పశువుల్లాంటి పెంపుడు జంతువులు అరుస్తాయి. ఈ అంశాన్ని జర్మనీలోని హాంబర్గ్ కు చెందిన వాతావరణ పరిశోధనా సంస్థ పరిశోధకుడు డాక్టర్ విల్ హేమ్ల్ టెల్లర్ అధికారికంగా వెల్లడించారు. ఆవులు, కుక్కలు, గొర్రెలు, పిల్లులకు ఇంకా గోల్డ్ ఫిష్ లాంటి చేపలకు వాతావరణంలో రాబోయే మార్పులను గ్రహించే శక్తి ఉందని తెలియజేశారు. జోహాన్స్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ విల్లీ యాజర్ మాన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. వాతావరణాన్ని తెలియజేసే ఇవాళ్టి అత్యాధునికమైన యంత్ర పరికరాల కంటే కూడా పెంపుడు జంతువులు అత్యంత సమర్ధవంతంగా వాతావరణంలో రాబోయే పెను మార్పులను సూచిస్తాయని, వాటి ప్రతిస్పందనలు పొరపాటయ్యే అవకాశమే లేదని చెప్పారు.

రెండో ప్రపంచ యుద్ధం పేరెత్తగానే హీరోషిమా నాగసాకి నగరాలు గుర్తొస్తాయి. అను బాంబుల 
కారణంగా జపాన్ లోని ఆ రెండు నగరాలు ఎంత ఘోరంగా నష్టపోయాయో మనకు తెలుసు. హీరోషిమా, నాగసాకి నగరాల్లో తాత్కాలికంగా నష్టం జరగడం కాదు, అనేక దశాబ్దాల పాటు తేరుకోలేని విధంగా పతనమయ్యాయి.
మరుసటి రోజు హీరోషిమా, నాగసాకి నగరాలపై బాంబులు కురుస్తాయి అనగా అక్కడి కోళ్ళు, కుక్కలు, ఆవులు, గేదెలు మొదలిన పెంపుడు జంతువులన్నీ ఎక్కడివక్కడ, ఎటు పడితే అటు పరుగులు తీశాయట. అలా జంతువులూ పరిగెట్టడాన్ని, పారిపోవడాన్ని చూసిన ప్రజలకి విషయం అర్ధం కాలేదట. ''ఒకటి కాదు, రెండు కాదు.. ఇన్నిన్ని జంతువులు ఎందుకు పారిపోతున్నాయి, ఎందుకు భయపడ్డాయి అని ఆశ్చర్యపోయారట. కొందరికి తమాషాగా అనిపించింది. ఇంకొందరికి కారణం ఏమిటో తెలీక విస్తు కలిగింది. మరికొందరికి చోద్యంగా అనిపించింది. మొత్తానికి అసలు సంగతి ఏమిటో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు.
తర్వాతి రోజు హీరోషిమా, నాగసాకి నగరాలపై అణు బాంబులు పడి తీరని నష్టం వాటిల్లిన తర్వాత గానీ అంతకు కొన్ని గంటల ముందు జంతువులు ఎందుకు పరుగులు తీశాయో అర్ధం కాలేదు.
శిధిలావస్థలో ఉన్న భవనం కూలిపోయేముందు ఆ సమీపంలో ఉన్న జంతువులకు తెలిసిపోతుందని అనేకమంది అనుభవాలు నిరూపించాయి. భవనం కూలిపోయే ముందు ఆ దగ్గర్లో ఉన్న జంతువులకు తెలిసిపోయి పెద్దగా అరుస్తాయట. ఆ ప్రాంతంలో కనుక స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే అరచుకుంటూ అక్కణ్ణుంచి పారిపోతాయి. ఒకవేళ కట్టేసి ఉన్నా బంధనాలు తెంచుకుని మరీ పరుగులు తీస్తాయి. అలా జరిగిన కొంత సేపటికి ఆ భవనం యొక్క కొంతభాగం లేదా పూర్తిగా కూలిపోవడం అనేకమంది అనుభవానికి వచ్చింది. ఇది ఏ ఒకరిద్దరి అనుభవమో కాదు. ఆయా సందర్భాల్లో తాము ఇలాంటి అనుభవాన్ని ప్రత్యక్షంగా చూశామని చెప్పారు. విపత్తు రాబోయే ముందు జంతువులు విపరీతంగా అరుస్తాయని, అటూ ఇటూ పరుగులు తీస్తాయని, అవకాశం చిక్కితే కట్లు తెంచుకుని పారిపోయాయని పెద్దలు చెప్తారు.

ఉన్నట్టుండి విపరీతమైన ఎండ, లేదా వాన రాబోతున్నప్పుడు, లేదా తుపాన్లు,భూకంపాలు లాంటి 
ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకోబోతున్నప్పుడు జంతువులు ఆగకుండా, ఆపకుండా అరుస్తుంటాయి. మనం ఆ సూచన అర్ధం చేసుకోకుండా ''అబ్బా చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నాయేంటి అని విసుక్కుంటాం. అరుస్తాం, వాటి నోరు మూయించడానికి చూస్తాం. ఇంకా కోపం వస్తే కర్రకు పని చెప్తాం. జంతువుల ప్రతిస్పందనలను అర్ధం చేసుకోలేదంటే అది మన అసమర్థత. వాటిపై ఎదురు దాడి చేస్తున్నాం అంటే మన లోపం. నోరులేని జంతువులు కదా.. అపూర్వ జ్ఞానం ఉండీ, అతీంద్రియ శక్తులు ఉండీ అదంతా మనకు స్పష్టపరచలేక మన చేతిలో చావు దెబ్బలు తింటూ ఉంటాయి.