ఇంట్లో ఎన్ని గదులు వుండాలి? దానికి ఏమైనా నియమాలు వున్నాయా?






ఇంట్లో ఎన్ని గదులు వుండాలి? దానికి ఏమైనా నియమాలు వున్నాయా?




Modern-homes-interio

మనిషి నివసించడానికి ఒకనాడు ఇల్లు కట్టుకున్నాడు. ఈ రోజు తన ఆడంబరాలు చూపించడానికి ఇల్లు కట్టుకుంటున్నాడు. గృహం ఒక ఊరులా కట్టుకుంటే అది గృహం అనడం సరికాదు. గృహం ఎంత ఉండాలి. ఎంత పరిధిలో ఎన్ని హస్తాలతో ఉండాలనేది శాస్త్ర నియమం. పదివేల హస్తాలతో యముడు యమసభను నిర్మించాడు. ఒక్కో ఇంటికి ఒక్కో కొలత ఉంటుంది. మనుషుల శరీర నిర్మాణాలన్నీ ఒకే కొలతలతో ఉంటున్నాయా? కుటుంబ సభ్యులను బట్టి, వారి ఆకృతులను బట్టి గృహ నిర్మాణాలు ఉంటాయి. అలాగే, గదుల ప్రమాణం కూడా పెంచుకుపోతున్న కొద్ది వాస్తు కన్నా ఇబ్బందులు ఎక్కువ. అవసరమైనంతమేర వాడకానికి అందుబాటులో ఉండగలిగినప్పుడే అవి ఉపయోగకరమైన గదులు అవుతాయి. లేనప్పుడు స్టోర్ గదులుగా మారి అనారోగ్య నిలయాలౌతాయి.

వెంటిలేటర్‌లు లేకుండా ఇళ్ళు కడితే తప్పా? :- శ్రీధర్, బంజారాహిల్స్
ఇళ్ళు ఎప్పుడైనా సంప్రదాయ బద్ధంగానే కట్టాలి. సంప్రదాయంలో ఒక శాస్త్రీయత ఉంటుంది. శాస్త్రీయతలో సైంటిఫిక్ అంశాలతోపాటు సైన్స్‌కు అందని నిగూఢ విషయాల వివరణ కూడా ఇమిడి ఉంటుంది. ఆ కోవలో గృహం దాని నిర్మాణ శైలి సామాన్యపు ఆలోచనల పరిధిని మించి ఉంటుంది. మనిషి శరీరంలో కార్బన్ డై ఆక్సైడ్ కింది ద్వారం నుండే వస్తుంది. పై ద్వారమైన నోటి నుండి రాదు. కారణం శరీర నిర్మాణశైలి. అలాగే, ఇళ్ళు కూడా శరీరం లాంటి తలకిందులయ్యే నిర్మాణ శైలితో ఉంటుంది. అంటే గృహంలోని కార్బన్‌డయాక్సైడ్ తేలికగా ఉండి పై భాగాల నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటుంది. అందుకనే, వెంటిలేటర్‌లు పైన పెట్టడంలోని ఔచిత్యం అది. చాలామంది వాటిని అద్దాలతో బిగిస్తూ ఉంటారు. ఇది చాలా దోషం. కాబట్టి, ఇంటి ప్రతి గదికి వెంటిలేటర్‌లు అవసరం.

మెట్లు వచ్చిన తర్వాత ఎంత ఖాళీ స్థలం ఉంటే మంచిది? :- లత, ఇందిరాపార్క్
మెట్లు వేసే స్థలాన్ని బట్టి ఖాళీ స్థలాన్ని నిర్ణయించాలి. ప్రధానంగా మెట్లు తూర్పు ఆగ్నేయంలో, దక్షిణ నైరుతిలో, పశ్చిమ వాయవ్యంలో అలాగే ఉత్తర వాయవ్యంలో వస్తుంటాయి. ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి అనే అంశం తూర్పు, ఉత్తర దిశలకు మాత్రమే వర్తిస్తుంది. పడమరలో మెట్లు వేసినప్పుడు మెట్ల స్థలం కలుపుకొనే పడమర ఖాళీని లెక్కించాలి. ఆ మెట్ల వెనక ఉన్న స్థలాన్ని లెక్కించాల్సిన పనిలేదు. తూర్పువైపు ఖాళీని పడమరవైపు ఉన్న ఖాళీ కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఈ విధానం దక్షిణ, ఉత్తరాలకు కూడా వర్తిస్తుంది. అంటే దక్షిణం కన్నా ఉత్తరం వైపు ఖాళీ ఎక్కువగా ఉండాలి. ముఖ్య విషయం ఏమిటంటే తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకున్నప్పుడు మెట్ల స్థలం కలుపుకొనే తూర్పు ఖాళీని లెక్కించాలి. మెట్లు కాకుండా లెక్కించాల్సిన పనిలేదు.

ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఏమిటంటే మెట్ల కొరకు కొందరు ఫిల్లర్స్ భూమిలోంచి వేసుకొని మెట్లకు సపోర్ట్‌గా వేసి కడుతుంటారు. అప్పుడు మాత్రం మెట్ల స్థలం పోగా ఉన్న ఖాళీనే పరిగణలోకి తీసుకోవాలి.

పశ్చిమ వాయవ్యంలో మా ఇంటికి మెట్లు వేశాం. ఫరవాలేదా? :- క్రిష్ణవేణి, హన్మకొండ
వాస్తులో ప్రతీ దానికి ఒక నిర్దిష్టమైన స్థలాలు, కొలతలు ఏర్పాటు చేశారు. మనిషి శరీరంలో అవయవాలను చూసినప్పుడు రెండు కళ్ళు ముందుకే ఉంటాయి. మనిషిని తయారు చేసే అవకాశం ఒకవేళ మనిషికే ఇచ్చినట్లయితే వెనక వైపు కూడా కళ్ళు పెడతాడేమో?
కానీ, సృష్టి రచనలో ప్రతీ అవయవ నిర్మాణానికి ఒక ప్రాధాన్యం ఉంది. ఆ దిశలో రోబోలను కూడా మానవులకు ప్రతిరూపాలుగా తప్ప మరో విధంగా తయారు చేయలేకపోయారు. ఆ కోవలో మనిషి నిర్మాణానికి, గృహ నిర్మాణానికి దగ్గర సంబంధం ఉంది. 
మెట్లు నిర్మించాలంటే సున్నితమైన దిశలు పనికిరావు. సున్నితం అని అంటే బరువుకు సంబంధించిన అంశం కాదు. దిశల మనస్సుకు సంబంధించిన విషయం. ఎలా అంటే ఎదిగిన కొడుకు మాట్లాడే విధానానికి, ఆ కొడుకును కన్న తండ్రి మాట్లాడే విధానానికి ఎంతో తేడా ఉంటుందన్న విషయం మనకు తెలుసు. ఐతే, ఈ ఇద్దరిలో ఎవరికి అవయవాల లోపం లేదు. నాలుక లేకుండా లేదు. కానీ, ఇద్దరిని వేరు చేసి చూపెడుతుంది. ఏమిటది, అనుభవ జ్ఞానం. అలాగే, దిశలు కూడా. పడమర వాయవ్యంలోని మెట్లను ముందు తొలగించాలి. వాటిని పశ్చిమ నైరుతిలోకి మార్చాలి.