పేపర్‌ నాప్కిన్స్‌ తయారి పరిశ్రమ ...?





ఇటీవలకాలంలో హోటళ్లు, రెస్టారెంట్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, రైల్వే క్యాటరింగ్‌, బఫే క్యాటరింగ్‌, టూరిస్ట్‌ రిసార్ట్స్‌ వంటి ఆహార పదార్థాలు సరఫరా చేసే ప్రదేశాల్లో పేపర్‌ నాప్కిన్స్‌ ఉపయోగం లేదా వినియోగదారులకు ఇవ్వడం సర్వసాధారణమైంది. అదేవిధంగా ఎయిర్‌పోర్టులు, కన్వెన్షన్‌ సెంటర్లు, ఖరీదైన ఫంక్షన్‌ హాళ్లలో టాయిలెట్స్‌ వద్ద కూడా చేతులు తుడుచుకోవడానికి పేపర్‌ నాప్కిన్స్‌ ఏర్పాటుచేస్తున్నారు. అదేవిధంగా బేకరీలు, సమోసా స్టాల్స్‌, చాట్‌ బండార్‌, స్వీట్‌ కారన్‌ కార్ట్‌ (బండి) వంటి చిన్న చిన్న వ్యాపారులు కూడా వినియోగదార్ల పరిశుభ్రత కోసం పేపర్‌ నాప్కిన్స్‌ను అందిస్తున్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరుగుతున్న కొద్దీ, పేపర్‌ నాప్కిన్స్‌ వినియోగం పెరుగుతున్నదని చెప్పవచ్చు.

చ.మీ.కు 15 నుంచి 20 గ్రాముల బరువు ఉండే కాగితాన్ని టిష్యూ పేపర్‌ అంటారు. ఈ టిష్యూ పేపర్‌ను 6''x6'', 9''x9'', 11''x11'', 12''x12'' అంగుళాల సైజుల్లో కత్తిరించి, అవసరాన్ని బట్టి నాలుగు రంగుల్లో ముద్రి స్తుంటారు. సాధారణంగా చ.మీ. 15 గ్రాముల బరువు ఉండే టిష్యూ పేపర్‌ నాప్కిన్స్‌ను ఫేషియల్‌ టిష్యూ అంటారు. వాటిని ముఖం తుడుచుకోవడానికి ఉపయోగిస్తుంటారు. మిగిలిన నాప్కిన్స్‌కు సాధారణంగా చ.మీ.కు 20 గ్రాములు బరువు తూగే టిష్యూ పేపర్‌ను ఉపయోగిస్తారు.



తయారీ విధానం




టిష్యూ పేపర్‌ రోల్స్‌ను సేకరించి, ఫెక్లీ గ్రాఫిక్‌ ప్రింటింగ్‌, ఎంబోజింగ్‌, మడత పెట్టి, కటింగ్‌ చేసే అటాచ్‌మెంట్స్‌ ఉన్న పేపర్‌ నాప్కిన్స్‌ తయారీ యంత్రం ద్వారా ముందుగా నిర్ణయించిన సైజు గల పేపర్‌ నాప్కిన్‌ తయారుచేస్తారు. సాధారణంగా 1000 నాప్కిన్స్‌ను ఒక ప్లాస్టిక్‌ పౌచ్‌లో ఉంచి సీలింగ్‌ చేసి, బల్క్‌ ప్యాకింగ్‌ ద్వారా మార్కెట్‌కు తరలిస్తారు.
ఈ పేపర్‌ నాప్కిన్స్‌ పొడిగా ఉంటాయి. తడిగా ఉండే నాప్కిన్స్‌ లేదా వెట్‌ వైప్స్‌ అనే మరోరకం పేపర్‌ నాప్కిన్స్‌ కూడా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.




తడి పేపర్‌ నాప్కిన్స్‌ లేదా టవల్‌




యాంటి బాక్టీరియల్‌ సబ్బును టిష్యూ పేపర్‌పై కోటింగ్‌గా వేయడం ద్వారా ఈ తడి నాప్కిన్స్‌ తయారుచేస్తారు. సువాసనకు మంచి వాసననిచ్చే కెమికల్‌ను కూడా ఉపయోగిస్తారు. ప్రత్యేక యంత్ర పరికరాలతో తయారుచేసే ఈ తడి నాప్కిన్స్‌ను ప్లాస్టిక్‌ పౌచ్‌లో ఒక్కొక్క దానిని ప్యాక్‌చేస్తారు.



తడి నాప్కిన్స్‌ ఉపయోగం




సబ్బుతో శుభ్రం చేసుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఈ సోప్‌ కోటెడ్‌ టిష్యూను ఉపయోగించవచ్చు. చేతులు శుభ్రం చేసుకోవడానికి, ముఖాన్ని శుభ్రపర్చుకోవడానికి, చంటి పిల్లలు కాలకృత్యాలు తీర్చుకున్న తరవాత శుభ్రపర్చడానికి, పాథలాజికల్‌ ల్యాబ్‌లలో శాంపిల్స్‌ కలెక్షన్‌ చేసిన తరవాత చేతులు శుభ్రం చేసుకోవడానికి ఈ నాప్కిన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు, పిల్లల తల్లులు తమ బ్యాగ్‌లలో ఈ తడి న్యాప్కిన్స్‌ ఉంచుకోవడం అవసరంగా మారింది. ఇటీవలికాలంలో వెట్‌ (తడి) టిష్యూస్‌కు డిమాండ్‌ బాగా పెరుగుతున్నది. రాత్రిపూట ప్రయాణించే బస్సుల్లో తడి టిష్యూలను ప్రయాణికులకు ఇవ్వడం ద్వారా రవాణా సంస్థలు వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. డ్రై (పొడి) పేపర్‌ నాప్కిన్స్‌కు, తడి (వెట్‌) నాప్కిన్స్‌కు డిమాండ్‌ క్రమేణా పెరుగుతున్నందున ఆసక్తి ఉన్న యువత ఈ పరిశ్రమలను ప్రారంభించి స్వయంఉపాధి పొందవచ్చు.

పరిశ్రమ వ్యయం
1.పేపర్‌ నాప్కిన్స్‌ తయారీ పరిశ్రమ
ఉత్పత్తి సామర్థ్యం: రోజుకు 500 కేజీలు / సంవత్సరానికి 150 టన్నులు
పరిశ్రమ ప్రారంభ వ్యయం: రూ.16.00 లక్షలు

2.తడి నాప్కిన్స్‌ (వెట్‌ టిష్యూలు) తయారీ పరిశ్రమ

ఉత్పత్తి సామర్థ్యం: రోజుకు 1,25,000 తడి నాప్కిన్స్‌
పరిశ్రమ ప్రారంభ వ్యయం: రూ.70.00 లక్షలు